Vijay Sethupathi: హీరో కావాలనే కలే లేదు.. వాళ్ల కోసం డబ్బు సంపాదించడమే లక్ష్యం..

Vijay Sethupathi

Vijay Sethupathi: తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి తన చిన్ననాటి జీవితంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడే తమ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంటికి అప్పులు వసూలు చేసేందుకు అప్పులు ఇచ్చిన వాళ్లు వచ్చిన సందర్భాలు తరచూ ఉండేవని, అలాంటి సమయంలో తండ్రి పక్కనే కూర్చొని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని విజయ్ సేతుపతి చెప్పారు. సమస్యల నుంచి పారిపోవడం కంటే, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనే పాఠం అప్పుడే తనకు అర్థం అయ్యిందని, అది జీవితంలో ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

తాను ఎప్పుడూ నటుడిగా మారాలని కలలు కనలేదని, కుటుంబానికి అండగా నిలబడేందుకు, వాళ్ల కోసం డబ్బు సంపాదించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. జీవితం ముందుకు సాగేకొద్దీ అనుకోకుండా సినీ రంగంలో అవకాశాలు రావడం, వాటిని సద్వినియోగం చేసుకోవడంతో నటుడిగా తన ప్రయాణం ప్రారంభమైందన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన విలక్షణమైన తనతో నేడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా ఎదిగారు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. పేదరికం నుంచి స్టార్‌డమ్ వరకు విజయ్ సేతుపతి సాగించిన ఈ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కష్టాలు మనిషిని బలహీనుడిని చేయవని, వాటిని ఎదుర్కొనే ధైర్యమే విజయానికి అసలైన బాట అని ఆయన జీవితం మరోసారి చాటిచెబుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.