
Yash: ‘కేజీఎఫ్’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టపడేవాడినని యశ్ తెలిపారు. స్కూల్, కాలేజీలో డ్యాన్స్, డైలాగ్స్ కారణంగా టీచర్లు తనను ‘హీరో’ అని పిలిచేవారని చెప్పారు. దీంతో తాను నిజంగానే పుట్టుకతోనే హీరోనని భావించేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. కర్ణాటకలో వీరప్పన్ హవా ఉన్న సమయంలో చిన్నతనంలోనే స్కూల్లో “నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. వీరప్పన్‌ను పట్టుకుని తీసుకొస్తాను” అంటూ డైలాగ్ చెప్పిన విషయాన్ని కూడా యశ్ గుర్తుచేసుకున్నారు. తన అల్లరి, కాన్ఫిడెన్స్‌కు స్కూల్, కాలేజీ వాతావరణం ఎంతో సహకరించిందన్నారు.
సినీ కుటుంబాల నుంచి వచ్చిన నటులకు కొన్ని అవకాశాలు త్వరగా లభించే అవకాశం ఉంటుందని యశ్ అంగీకరించారు. అయితే చివరకు ప్రేక్షకులే ఒక నటుడి విజయాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. వారసత్వంగా వచ్చిన వారికి కూడా తమ సొంత సవాళ్లు, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. తమలాంటి వారికి మాత్రం సినీ పరిశ్రమలో మొదటి మెట్టు వెతుక్కోవడానికే చాలా సమయం పడుతుందని యశ్ అన్నారు. ఆ మొదటి మెట్టు దొరికిన తర్వాత దానిపై ఎంత ఎత్తుకు ఎదగాలనేది మన కష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తన ఎదుగుదలలో తన కంటే ఎక్కువగా ఎంతోమంది వ్యక్తులు సహాయం చేశారని యశ్ చెప్పారు. ప్రేక్షకులు తనను స్టార్‌గా నిలబెట్టారని, వారి ప్రేమ, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం యశ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.













