
Anurag Kashyap: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకంటే 23 ఏళ్లు చిన్నదైన నటి శుభ్రాశెట్టితో ఉన్న రిలేషన్‌షిప్‌పై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతం వీరిద్దరి బంధం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అనురాగ్ కశ్యప్ వయసు 53 ఏళ్లు కాగా, శుభ్రాశెట్టి వయసు 30 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి మాట్లాడిన అనురాగ్.. మొదట ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించినట్లు తెలిపారు. వయసులో ఇంత పెద్ద తేడా ఉండటంతో ఈ బంధం విషయంలో వెనక్కి తగ్గాలని భావించినట్లు చెప్పారు.
అయితే శుభ్రాశెట్టితో కలిసి ఉన్నప్పుడు తనకు ఎలాంటి ఏజ్ గ్యాప్ అనిపించలేదని అనురాగ్ పేర్కొన్నారు. ఆమెతో ఉన్నప్పుడు తాను చాలా సంతోషంగా ఉంటున్నానని, ప్రస్తుతం జీవితంలో లభిస్తున్న ఈ ఆనందాన్ని కోల్పోవాలని అసలు అనుకోవడం లేదని చెప్పారు. ఇక పెళ్లి గురించి కూడా అనురాగ్ కశ్యప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమ బంధానికి పెళ్లి అనే పేరును తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. ఒకరితో ఒకరు కలిసి ఉండటం, సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ తమ బంధం విషయంలో ఇద్దరూ సంతోషంగా ఉన్నామని ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ ఆసక్తి చూపించే నెటిజన్లు.. దర్శకుడి వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు.














