Modern Missamma: ‘పెళ్లి చేసుకోవద్దు’ అని కాదు.. కానీ ఇది మాత్రం తెలుసుకోండి! ‘మోడ్రన్ మిస్సమ్మ’

Modern Missamma

Modern Missamma: హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’. లాస్య అండ్ మిథున క్రియేషన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి పామిడి, శివ పామిడి, కిరణ్ కుమార్ నల్లూరి, శ్రావంతి నంబూరి నిర్మిస్తున్నారు. సాయి బాబా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సిజు ఏఆర్‌, ప్రమోదిని, హారిక, డాక్టర్ భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘వడల’ నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఈ సినిమా ప్రీమియర్ చూశాను. సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు అందులో లోపాలను వెతుకుతుంటాను. కానీ ‘మోడ్రన్ మిస్సమ్మ’లో ఒక్క లోపం కూడా కనిపించలేదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ముఖ్యంగా డాక్టర్ భద్రం పాత్ర చాలా నవ్విస్తుంది’’ అన్నారు. హీరో హర్ష నర్రా మాట్లాడుతూ.. ‘‘‘మిస్సింగ్’, ‘రోటీ కపడా రొమాన్స్’ తర్వాత ఇది నా మూడో సినిమా. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా నా ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. కష్టపడుతూనే ఉంటాను. ఈ సినిమాను కేవలం కష్టపడి కాకుండా ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో చేశాం. మొత్తం టీమ్‌ స్నేహితుల్లా కలిసి పనిచేసింది. తన్మయి అద్భుతంగా నటించింది. గోపీ సుందర్‌ అందించిన సంగీతం, కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం అందరికీ కనెక్ట్ అవుతాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ.. ‘‘‘23’ తర్వాత నేను నటించిన సినిమా ఇది. ‘మనం’ వంటి సినిమాల్లోని పాటలు ఒక వర్గానికి ఎలా కనెక్ట్ అయ్యాయో.. మా ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ పాట కూడా నేటి మహిళలకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. దర్శకుడు ఈ కథను మహిళ కోణంలో రాయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. దర్శకుడు సాయి బాబా మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ సింగిల్‌కు వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉంది. పెద్దలు ఇల్లు కట్టి, పెళ్లి చేసి చూడమంటారు. నేను దానికి ఇంకో మాట జోడిస్తాను.. సినిమా తీసి చూడండి. ఈ మూడు పనులు చేయడం అంత సులభం కాదు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్ టైటిల్‌ను పెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎన్టీఆర్‌ గారు, భూమిక గారు నటించిన ‘మిస్సమ్మ’ చిత్రాలు అప్పట్లోనే ఎంతో ముందుచూపుతో తెరకెక్కాయి. మా సినిమాలోనూ అలాంటి బలం ఉందని నమ్మాం. మా నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం జరిగింది. గోపీ సుందర్‌ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం అని అన్నారు. ఈ సినిమా పెళ్లి చేసుకోవద్దని చెప్పడం లేదు. పెళ్లికి ముందు ఏం తెలుసుకోవాలి? ఎలాంటి విషయాలను అర్థం చేసుకోవాలి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ‘మోడ్రన్ మిస్సమ్మ’ చూడాలి’’ అన్నారు. నిర్మాత చిరంజీవి పామిడి మాట్లాడుతూ.. ‘‘‘కాలింగ్ సహస్ర’ తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఆ సినిమాతో ఆశించిన ఫలితం రాలేదు. అయితే ‘మోడ్రన్ మిస్సమ్మ’ మంచి స్పందన అందుకుంటుందనే నమ్మకం ఉంది. హర్ష, తన్మయి ఇద్దరూ అద్భుతంగా నటించారన్నారు.