యాక్సిడెంట్ దురదృష్టకరం.. నేను బాధ్యత మరచిపోలేదు: లింగమనేని సంజూష్

Lingamaneni sanjush
హైదరాబాద్‌లో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు, వాహనం నడుపుతున్న సంజూష్ స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని స్పష్టం చేశారు. తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని తన సొంత వాహనంలోనే ఆస్పత్రికి తరలించి, అత్యవసర వైద్యం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. బాధితురాలికి చికిత్స అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఆమె మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని సంజూష్ పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులను కలిశానని, ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించడంతో పాటు దర్యాప్తుకు సహకరించినట్లు తెలిపారు. ప్రమాదానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను పోలీసులు నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు.

ప్రమాద సమయంలో తన శారీరక, మానసిక స్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహించారని సంజూష్ తెలిపారు. మూడు పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చాయని, తాను మద్యం సేవించి వాహనం నడపలేదని స్పష్టం చేశారు. ఈ వైద్య పరీక్షల ఫలితాలను కూడా దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

భారతి ముఖి అకాల మరణం అత్యంత విషాదకరమని పేర్కొన్న సంజూష్.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరగవని, జరిగిన పరిణామంపై తాను తీవ్రంగా విచారిస్తున్నానని చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించడం, అనంతరం పోలీసులను సంప్రదించడం, దర్యాప్తుకు సహకరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఘటనపై అపోహలు, అసత్య ప్రచారాలు చేయకుండా వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.