
Sukumar: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో తనదైన మేకింగ్, కథనం, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా విభిన్న జానర్లలో కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏకంగా ఆరు సినిమాలను లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఆరు ప్రాజెక్ట్‌లకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సినిమాకు ఒక్కో దర్శకుడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనుండగా.. సుకుమార్ తన రచన, కథనం, స్క్రీన్‌ప్లే ద్వారా వాటికి క్రియేటివ్ సపోర్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఆరు కథలు, ఆరు విభిన్న ప్రపంచాలు, ఆరుగురు దర్శకులు అయినప్పటికీ.. వాటి వెనుక సుకుమార్ రైటింగ్ ప్రధాన బలంగా ఉండనుంది.
ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా పలు విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్త దర్శకులను ప్రోత్సహించడంతో పాటు, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను రూపొందించడంపై సుకుమార్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఆరు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని, పూర్తిగా భిన్నమైన స్టోరీలతో తెరకెక్కనున్నట్లు సమాచారం. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా, లవ్ స్టోరీ వంటి విభిన్న జానర్లను టచ్ చేస్తూ ఈ ప్రాజెక్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రతి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, దర్శకుల పేర్లు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సుకుమార్ స్వయంగా దర్శకత్వం వహించే సినిమాలతో పాటు.. తన రైటింగ్ ద్వారా ఇండస్ట్రీ కి దర్శకులుగా పరిచయం కాబోయే యువ డైరెక్టర్స్ సినిమాలకు బలమైన కథనాన్ని అందించడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు, ఫ్రెష్ కాన్సెప్ట్స్‌తో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతున్న సమయంలో సుకుమార్ తీసుకుంటున్న ఈ ప్రయత్నం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశం ఉంది. ఆరు కథలు.. ఆరుగురు దర్శకులు.. కానీ వెనుక ఒకే క్రియేటివ్ ఫోర్స్ సుకుమార్. మరి ఈ ఆరు సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాలి.














