Irumudi Box Office Collection: ‘ఇరుముడి’తో రవితేజ కెరీర్ బెస్ట్.. ఫస్ట్ డేనే అదిరిపోయే వసూళ్లు!

Irumudi Kattu

Irumudi Box Office Collection: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలిరోజే సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. దీంతో రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇరుముడి’ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తా చాటింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో తొలి రోజుకు ఏకంగా 3.35 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్స్, డే-1 కలెక్షన్స్ కలిపి $470Kకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ‘మాస్ మహారాజా ఈజ్ బ్యాక్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఇండియాలోను ఈ సినిమా తొలి రోజు మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు రూ.14.80 కోట్లు కాగా, వరల్డ్‌వైడ్ గ్రాస్ దాదాపు రూ.24.20 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఈ కలెక్షన్స్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారికంగా పూర్తి గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. ఇక సినిమాలో రవితేజ త్రినాథ్ అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించారు. తాగుడికి బానిసైన ఓ తండ్రి.. తన కుమార్తె కోరిక మేరకు 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకోవడం, ఆ తర్వాత గ్రామంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయడం చుట్టూ కథ సాగుతుంది. కేవలం మాస్ యాక్షన్ అంశాలకే పరిమితం కాకుండా తండ్రి-కూతురు అనుబంధం, మహిళా భద్రత వంటి భావోద్వేగ, సామాజిక అంశాలను కూడా దర్శకుడు శివ నిర్వాణ కథలో మేళవించారు. రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ నటించగా, బాలనటి బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. తొలి రోజు స్పందన ఇదే స్థాయిలో కొనసాగితే ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.