Mega birthday wishes: అన్నయ్య నుంచి తమ్ముడికి అదిరిపోయే బర్త్‌డే విషెస్.. పవన్‌పై చిరంజీవి హాట్‌ఫుల్ కామెంట్స్!

Mega wishes

Mega birthday wishes: మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వీరిద్దరూ ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తమ్ముడిని “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ సంబోధించిన చిరంజీవి.. ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత, ప్రజల కోసం పనిచేయాలనే తపనను కొనియాడారు.

పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చిరంజీవి కోరుకున్నారు. మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో ఎంతో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ఇతరులకు మంచి చేయాలనే తపనను తాను గమనిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేపట్టే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేసేలా వేస్తారని ప్రశంసించారు. కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని అన్నారు.

పిఠాపురం ప్రజలు తనను గెలిపించిన తర్వాత.. పవన్ ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా వారికి అండగా నిలుస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందం, గర్వాన్ని కలిగిస్తోందని తెలిపారు. చిరంజీవి చేసిన ఈ ప్రత్యేక బర్త్‌డే పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. అన్నయ్య నుంచి తమ్ముడికి వచ్చిన ఈ ప్రేమపూర్వక సందేశంపై అభిమానులు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.