
TGTET 2026 Key: తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET-ఇన్సర్వీస్ టీచర్స్-2026) రాసిన వేలాది మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. ఈ నెల 8, 9వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ (Key)ని పాఠశాల విద్యాశాఖ అధికారిక పోర్టల్లో అందుబాటులో ఉంచింది. అయితే కీ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి కేవలం సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకే గడువు విధించడంతో అభ్యర్థులు వెంటనే తమ సమాధానాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష రాసిన ఉపాధ్యాయులు తమ ప్రశ్నాపత్రాల కోడ్ ఆధారంగా సమాధానాలను చెక్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అధికారిక లింకులను పొందుపరిచారు.
ప్రాథమిక కీలో ఏవైనా సమాధానాలపై సందేహాలు లేదా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే, అభ్యర్థులు నిర్దేశిత ఆధారాలతో అధికారిక లింక్ ద్వారానే తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. వచ్చిన వినతులను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీ, ఫలితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.









