Ranabali: చరిత్ర దాచేసిన పచ్చి నిజాలు బయటపెడతాం: రణబాలి టీం

Ranabali

Ranabali: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే ప్రమోషన్లలో భాగంగా టీజర్లు, ట్రైలర్లు, పాటలను రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో చరిత్ర పుటల్లో సమాధి అయిపోయిన నిజాలను వెలికితీసేందుకు ఏకంగా ఓ డాక్యుమెంటరీ సిరీస్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. దసరా కానుకగా అక్టోబరు 16న బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. సమాజానికి తెలియకుండా చరిత్ర నుంచి తుడిచిపెట్టేసిన వాస్తవాలను సమాజం ముందుంచేందుకు ‘రణబాలి: నెవర్ ఫర్‌గెట్ ది ట్రూత్’ పేరిట నాలుగు భాగాల ఎక్స్‌క్లూజివ్ డాక్యూ సిరీస్‌ను యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ సిరీస్ వివరాలను పరిశీలిస్తే మొదటి ఎపిసోడ్‌లో ‘ది ఫెమైన్ వి ఫర్‌గాట్’ (మనం మరిచిపోయిన కరవు) పేరిట యూట్యూబ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్‌గాట్’ పేరుతో సెప్టెంబరు 30న విడుదల కానుంది. మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్‌గాట్’ పేరిట అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ తేదీని చిత్ర యూనిట్ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. సినిమాలోని పాత్రలు, కథా నేపథ్యం మాత్రమే కాకుండా, అప్పట్లో చరిత్ర పుటల్లో చోటు దక్కించుకోలేకపోయిన యదార్థ సంఘటనలు, ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ విజువల్స్‌తో ఈ డాక్యూ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. సినిమాటిక్ యూనివర్స్‌కు రియలిస్టిక్ చరిత్రను జోడిస్తూ చిత్రబృందం చేస్తున్న ఈ వినూత్న ప్రమోషన్ సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.