
Allu Sirish: హైదరాబాద్ నగరంలో సౌండ్ పొల్యుషన్, రూల్స్‌కి విరుద్ధంగా మోగే లౌడ్ స్పీకర్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విలాసవంతమైన ప్రాంతాల్లో సైతం నిబంధనలు గాల్లో కలిసిపోతున్నాయంటూ ప్రముఖ తెలుగు నటుడు అల్లు శిరిష్ నేరుగా సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారింది. అర్థరాత్రి దాటినా ఆగని మైకుల హోరుపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
షేక్‌పేట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ‘అపర్ణ వన్’ లగ్జరీ అపార్ట్‌మెంట్ టవర్స్‌లో నివాసముంటున్న అల్లు శిరిష్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఒక వీడియోను పోస్ట్ చేస్తూ రూల్స్ కఠినంగా అమలు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులను కోరారు. తన నివాసం సమీపంలోని ఓ ఆలయం వద్ద అనుమతించిన డెసిబెల్ పరిమితిని మించి, అర్థరాత్రి దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలతో స్పీకర్లు పెడుతున్నారని ఆయన వీడియో సాక్షిగా బహిర్గతం చేశారు. గతంలోనే దీనిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 25న గణేష్ నిమజ్జనం ముగిసే వరకు కాస్త ఓపిక పట్టాలని అధికారులు సూచించారని ఆయన పేర్కొన్నారు. అయితే పండుగ, నిమజ్జనం అన్నీ పూర్తయినప్పటికీ మైకుల మోత మాత్రం యథావిధిగా కొనసాగుతుండటంతో చేసేది లేక ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు. సమస్యను సంబంధిత అధికారిక విభాగానికి బదిలీ చేసి తక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగకుండా తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. అల్లు శిరిష్ పోస్టుపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి స్పందిస్తున్నారు. పండుగల వేళ గుళ్ల వద్ద వచ్చే మైకుల శబ్దాల గురించే మాట్లాడటం కాదని, ఏడాది పొడవునా సమీపంలోని దాదాపు పదికి పైగా మసీదుల నుంచి వచ్చే సౌండ్స్, ఇతర మతపరమైన లౌడ్‌స్పీకర్ల గోల సంగతేంటని పలువురు నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లాంటి భిన్న సంస్కృతుల మహానగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు అనేవి ఏ ఒక్క వర్గానికో కాకుండా, అన్ని మతాల ప్రార్థనా స్థలాలకూ సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీ వీడియోతో మొదలైన ఈ రగడ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమాన చట్టాల అమలుపై పెద్ద చర్చకే దారితీసింది.
Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026














