Bandla Ganesh: “ఒక్క సినిమా ఇవ్వు బాబు.. బ్లాక్‌‌బస్టర్ కొడతా” బండ్ల గణేష్ కోరినపై అక్కినేని హీరో మైండ్ బ్లోయింగ్ రియాక్షన్!

Naga Chaitanya

Bandla Ganesh: టాలీవుడ్‌లో నిర్మాత బండ్ల గణేష్ రీఎంట్రీపై చాలా కాలంగా పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్లతో భారీ హిట్లు కొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఆయన.. ప్రస్తుతం మళ్లీ ప్రొడక్షన్‌లోకి దిగేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యను నేరుగా కలిసిన బండ్ల గణేష్, తనదైన మార్క్ పంచ్‌తో ఒక క్రేజీ రిక్వెస్ట్ పెట్టడం.. దానికి చైతూ ఇచ్చిన జవాబు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నటుడిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ‘తీన్‌మార్’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘టెంపర్’ వంటి భారీ చిత్రాలతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌‌గా చక్రం తిప్పారు బండ్ల గణేష్. కొంతకాలంగా నిర్మాణానికి దూరంగా ఉంటున్నా, తనదైన స్పీచ్‌లతో, ఇంటర్వ్యూలతో నిరంతరం ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చారు. తాజాగా సరైన కాంబినేషన్ కుదిరితే మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన ఆయన.. ఇటీవల ఓ సందర్భంలో నాగచైతన్యను ముఖాముఖి కలిశారు.

అక్కడున్న వారి ముందే చైతూ వైపు చూస్తూ.. ‘‘నాకు ఒక్క సినిమా ఇవ్వు బాబు.. మళ్లీ పక్కా బ్లాక్‌బస్టర్ తీసి చూపిస్తా!’’ అంటూ తనదైన యాసలో ఓపెన్‌గా సినిమా అడిగేశారు. బండ్ల గణేష్ అడిగిన తీరుకు నాగచైతన్య ఇచ్చిన రెస్పాన్స్ అందరినీ విస్మయానికి గురిచేసింది. తాను బండ్ల గణేష్ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని చైతూ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కూడా బండ్ల గణేష్‌కే వదిలేస్తున్నట్లు, ఆయన ఎవరిని లాక్ చేసినా తాను నటించడానికి సిద్ధమేనని తేల్చిచెప్పారు. హీరో స్థాయిలోనే దర్శకుడి ఎంపిక విషయంలోనూ నిర్మాతపై అంతటి గుడ్డి నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా, ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బండ్ల గణేష్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీ అక్కినేని నాగచైతన్యతోనే ఉండబోతోందా? చైతూ ప్రామిస్‌తో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందా? అనే చర్చలు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రియుల్లోనూ మొదలయ్యాయి.