
Vijay Deverakonda: చరిత్ర పుస్తకాల్లో కనిపించని ఎన్నో వీరగాథలు జానపదాల్లో, బుర్రకథల్లో మాత్రమే బతికిపోయాయి. అలాంటి ఓ మరుగునపడిన పోరాట యోధుడి కథను వెండితెరపైకి తీసుకొస్తున్న చిత్రమే ‘రణబాలి’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దేశ చరిత్రలో కొందరు ప్రముఖుల పేర్లు మాత్రమే విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయని.. అదే సమయంలో ఎన్నో స్థానిక పోరాట యోధుల గాథలు ప్రజల మధ్యే పరిమితమైపోయాయని విజయ్ అభిప్రాయపడ్డారు. బుర్రకథలు, జానపద గీతాలు, తరతరాలుగా వస్తున్న కథనాల్లో మిగిలిపోయిన అలాంటి వీరుల గురించి ఈ తరానికి తెలియజేయాలనే ప్రయత్నమే ‘రణబాలి’ అని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సింగనమల బొబ్బిలి అనే యోధుడి చుట్టూ ‘రణబాలి’ కథ తిరుగుతుంది. బ్రిటిష్ పాలన కాలం నాటి పరిస్థితులు, తీవ్ర కరువు, ప్రజల జీవన పోరాటం, పరాయి పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయన్నారు. ఈ కథను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ విస్తృతంగా పరిశోధన చేసినట్లు చెప్పారు. ఒక పురాతన బుర్రకథ నుంచి మొదలైన ఆలోచన.. ఆ ప్రాంత చరిత్రను లోతుగా పరిశీలించే కొద్దీ పెద్ద కథగా మారిందని ఆయన చెప్పారు.
సింగనమల బొబ్బిలి పాత్రలో విజయ్ దేవరకొండ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా రాయలసీమ యాసను అలవర్చుకున్న ఆయన.. ట్రైలర్ లాంచ్ వేదికపైనా అదే యాసలో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు. “ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ?”** అంటూ బ్రిటిష్ పాలకులను ఉద్దేశించి విజయ్ చెప్పిన డైలాగ్‌కు ఈవెంట్లో సూపర్ రియాక్షన్ వచ్చింది. అనంతరం “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క!” అంటూ ఆయన గర్జించడంతో అభిమానుల సందడితో వేదిక మార్మోగిపోయింది. ‘రణబాలి’లో రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ కారణంగా ట్రైలర్ లాంచ్‌కు ఆమె హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా విజయ్ స్టేజ్‌పైనే రష్మికకు ఫోన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తన కెరీర్‌తో పాటు రష్మిక ఫిల్మోగ్రఫీలోనూ ప్రత్యేకంగా నిలుస్తుందని విజయ్ పేర్కొన్నారు. మరోవైపు భారీ పీరియాడిక్ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రాయలసీమ నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.














