Ranabali Trailer: కరువుతో కకావికలమైన సీమ.. తెల్లదొరలపై తిరుగుబాటు! ‘రణబాలి’ ట్రైలర్‌లో అసలు కథ ఇదే..

Ranabali Trailer

Ranabali Trailer: ఒకప్పుడు ఆకలితో అలమటించిన ప్రజలు.. మరోవైపు అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చేసిన తెల్లదొరలు.. ఈ రెండు ప్రపంచాల మధ్య నుంచి పుట్టుకొచ్చిన ఓ తిరుగుబాటు యోధుడి కథే ‘రణబాలి’ అని ట్రైలర్ స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటివరకు ‘రణబాలి’ అంటే విజయ్ దేవరకొండ మాస్ లుక్, సింగనమల బొబ్బిలి పాత్ర, రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ మాత్రమే ఎక్కువగా చర్చకు వచ్చాయి. కానీ ట్రైలర్ పూర్తిగా చూస్తే.. ఈ సినిమా వెనుక ఉన్న అసలు ప్రపంచం అంతకంటే పెద్దదిగా కనిపిస్తోంది. కేవలం ఓ యోధుడి వీరగాథను చెప్పడం కాకుండా.. ఒక ప్రాంతం ఆకలి, అవమానం, దోపిడీ మధ్య ఎలా తిరుగుబాటు వైపు మళ్లిందనే అంశాన్ని దర్శకుడు కథగా మలిచినట్లు తెలుస్తోంది.

ట్రైలర్‌లో కనిపించే పరిస్థితులు చూస్తుంటే బ్రిటిష్ పాలన కాలంలో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కథకు కీలకంగా మలిచినట్లు అర్థమవుతోంది. కరువు కారణంగా తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడుతున్న సమయంలోనూ పాలకుల దోపిడీ ఆగకపోవడం.. ఆ పరిస్థితుల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరగడం.. చివరకు అదే ఆగ్రహం తిరుగుబాటుగా మారడం ట్రైలర్‌లో బలంగా చూపించారు. ఈ నేపథ్యంలో సింగనమల బొబ్బిలి పాత్రలో విజయ్ దేవరకొండ తెరపైకి వస్తారు. ప్రజల కష్టాలను చూస్తూ మౌనంగా ఉండని వ్యక్తిగా, తెల్లదొరల ఆధిపత్యాన్ని సవాల్ చేసే యోధుడిగా ఆయన పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో విజయ్ చెప్పిన రాయలసీమ యాస డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ?” అంటూ బ్రిటిష్ పాలకులపై ఆయన విరుచుకుపడే సన్నివేశం పాత్రలోని తిరుగుబాటు స్వభావాన్ని ఒక్క డైలాగ్‌లోనే చెప్పేసింది. ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్, యాస.. మూడు కలవడంతో ఈ పాత్రపై అంచనాలు మరింత పెరిగాయి.

ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ, భారీ సెట్స్, బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చెబుతున్నాయి. ప్రతి సన్నివేశాన్ని పీరియడ్ ఫీల్ వచ్చేలా రూపొందించిన తీరు ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీనికి అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తోడవడంతో ట్రైలర్‌లోని యాక్షన్ మరింత ఎలివేట్ అయింది. ముఖ్యంగా తిరుగుబాటు సన్నివేశాల్లో వినిపించే బీజీఎం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ట్రైలర్‌లో రష్మిక మందన్న కూడా జయమ్మ పాత్రలో కనిపించారు. ఆమెకు సంబంధించిన సన్నివేశాలను మేకర్స్ పూర్తిగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే విజయ్ పాత్రతో ఆమెకు ఉన్న సంబంధం కథలో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ‘రణబాలి’ ట్రైలర్ చూస్తే.. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదని, ఒక కాలం నాటి ఆకలి, దోపిడీ, ఆగ్రహం, తిరుగుబాటును కలిపిన కథ అని స్పష్టమవుతోంది. సింగనమల బొబ్బిలి పాత్రలో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.