
Ravi Shankar: తెలుగు సినిమా చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పేర్లు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సరిగ్గా అదే స్థాయిలో రాయలసీమ గడ్డపై నుంచి వెలుగులోకి రాని ఒక అజ్ఞాత తెలుగు వీరుడి రక్తచరిత్రే ‘రణబాలి’ అని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
వేదికపై నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎందుకు చూడాలో ప్రేక్షకులకు స్పష్టమైన కారణాలు విడమరిచి చెప్పారు. “ఇది మన మట్టి కథ, మన సంస్కృతి. చరిత్ర పుటల్లో ఎవరికీ తెలియకుండా ఉండిపోయిన ఒక గొప్ప తెలుగు వీరుడి గాథను వెండితెరపై ఆవిష్కరించాలన్నది మా డైరెక్టర్ రాహుల్ విజన్. ఒక ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, మరో ప్రాంతంలో కొమరం భీమ్ ఎలాగైతే ప్రజల కోసం పోరాడారో.. రాయలసీమ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన అసలైన యోధుడు ‘రణబాలి’. కథ కోసం పేరులో చిన్నపాటి మార్పులు చేసినప్పటికీ, ఇది పక్కా మన నేల చరిత్ర. ఆ వీరుల సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో, రణబలిని కూడా అదే రేంజ్లో ఇండస్ట్రీ హిట్గా నిలబెడతారని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా, వారిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని నిర్మాత కొనియాడారు. ఫోక్లోర్ (జానపద నేపథ్యం)తో మొదలై అదే మూడ్తో సినిమా ముగుస్తుందని, కథలో సరికొత్త ప్రపంచంతో పాటు ఇటీవల అందరినీ మెప్పించిన చిత్రాల తరహాలో ఒక డివైన్ ఎలిమెంట్ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వివరించారు. ఈ చిత్రం కోసం వేసిన సెట్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే.. మదనపల్లికి చెందిన ఒక అభిమాని ఏకంగా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ సెట్లోనే పెట్టుకుంటామని రిక్వెస్ట్ చేశాడంటూ ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనాన్ని మెచ్చుకున్నారు.
విజయ్ దేవరకొండను ‘మా బంగారు కొండ’గా అభివర్ణించిన రవిశంకర్.. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. గుర్రపు స్వారీ నుంచి కఠినమైన యాక్షన్ ట్రైనింగ్ వరకు విజయ్ పడిన కష్టాన్ని చూస్తే గర్వంగా ఉందని, ఈ సినిమాతో ఆయనకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బిగ్గెస్ట్ బ్రేక్ దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాన్-ఇండియా లెవల్లో తమకు బ్లాక్బస్టర్ ఇచ్చిన రష్మిక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించారని, అక్టోబర్ 16న థియేటర్లలో సినిమా చూశాక “మేము ఏదో అనుకున్నాం.. కానీ ఇంత గొప్పగా ఉంటుందని ఊహించలేదు” అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ అని సవాల్ చేశారు.












