Sai Durgha Tej: ఒక్క సినిమా కోసం రెండున్నరేళ్లు.. బర్త్‌డే వేళ సంచలన మేకోవర్!

Sai Durgha Tej

Sai Durgha Tej: నమ్మిన కథ, దర్శకుడి విజన్ కోసం కెరీర్‌లోని కీలకమైన సమయాన్ని పణంగా పెట్టే అంకితభావం కొందరి హీరోల్లో కనిపిస్తుంది. మెగా హీరో సాయిదుర్గా తేజ్ సరిగ్గా అలాంటి అరుదైన సాహసమే చేశారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సరికొత్త ఊహా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ‘ఎస్‌.వై.జి’ (సంబరాల ఏటిగట్టు) ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రెండున్నరేళ్ల కాలాన్ని కేటాయించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు సాయిదుర్గా తేజ్ పూర్తిగా రూపురేఖలు మార్చుకున్నారు. ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో రస్టిక్ లుక్‌లోకి మారిపోవడమే కాకుండా, కఠినమైన శారీరక కసరత్తులతో పాత్రకు తగ్గ బలాన్ని తీసుకొచ్చారు. ఇతర ప్రాజెక్టులను సైతం పక్కనపెట్టి సుదీర్ఘ కాలం పాటు ఒకే ఒక్క ప్రపంచంలో జీవించిన ఆయన, ఎట్టకేలకు చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో ఆ బరువైన గెటప్ నుంచి బయటపడి, తన పాత స్టైలిష్ అవతారంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

గురువారం సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పూర్తి మేకోవర్ వార్త బయటకు రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఒక విజువల్ వండర్‌గా రాబోతున్న ‘సంబరాల ఏటిగట్టు’ కోసం ఆయన పడిన అంకితభావం, చేసిన త్యాగం వెండితెరపై భారీ స్థాయిలోనే ప్రతిబింబించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త జోష్‌తో కనిపించనున్న సాయిదుర్గా తేజ్, ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.