
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం (విశాఖపట్నం) అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకున్న తొలి అంతర్జాతీయ ప్రయాణికుడికి అధికారులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు.
‘మన్యం దీరుడు’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన నటుడు ఆర్.వి.వి. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు వేషధారణలోనే విమానాశ్రయానికి విచ్చేసిన ఆయన, తొలి ప్రయాణికుడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. వీరత్వం ఉట్టిపడే రూపంలో ఆయన కనిపించడంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
ఈ సందర్భంగా హీరో ఆర్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్రకు తలమానికమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గడ్డపై, నా చిత్రంలోని అదే అల్లూరి వేషధారణతో వచ్చి తొలి ప్రయాణికుడికి స్వాగతం పలకడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. నన్ను ఒక నటుడిగా గుర్తించి ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామిని చేసిన విమానాశ్రయ యాజమాన్యానికి కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
తాను నటించిన ‘మన్యం దీరుడు’ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణ దక్కించుకుంటోందని, చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.









