Irumudi Controversy: హిట్ టాక్‌ మధ్య ‘ఇరుముడి’కి కొత్త తలనొప్పి.. టీచర్స్ ఫెడరేషన్ ఫైర్!

Irumudi Controversy

Irumudi Controversy: మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుముడి’పై వివాదం మొదలైంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాల, అక్కడి విద్యార్థులను ప్రతికూలంగా చూపించడంతో పాటు.. ఓ ఉపాధ్యాయురాలి పాత్రను అవమానించే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారని ఫెడరేషన్ ఆరోపించింది. ఈ సన్నివేశాలను వెంటనే తొలగించాలని చిత్రబృందాన్ని డిమాండ్ చేసింది.

కాగా, రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సీలేరు ప్రాంతంలో ఆటో నడుపుకునే త్రినాథ్‌ (రవితేజ) చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. మద్యానికి బానిసైనప్పటికీ తన కుమార్తె మణెమ్మ (నక్షత్ర) అంటే ప్రాణంగా భావించే తండ్రిగా ఆయన కనిపిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష తీసుకునే 41 రోజులు నిష్ఠగా ఉండే త్రినాథ్.. తన ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ఆడపిల్లల హత్యల మిస్టరీని ఛేదించే క్రమంలో తన కుమార్తెను కాపాడుకునేందుకు చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. రవితేజ తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా సహజమైన నటనతో ఆకట్టుకున్నారని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో పాటు ‘మల్లెపూల పల్లకి’ పాటకు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల చిత్రీకరణపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో హిట్ టాక్ మధ్య ఇలాంటి వివాదంలో‘ఇరుముడి’ వార్తల్లో నిలిచింది.