టికెట్ రేట్లు–ప్రభుత్వ నిర్ణయాలు: గందరగోళంలో సినీ ప్రేక్షకుడు

Tollywood
‘అఖండ 2’ సినిమా విడుదల సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజాగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం సమర్పించిన మెమోను న్యాయస్థానం కొట్టివేసినా, ఇప్పటికీ పెంచిన రేట్లతోనే ‘రాజాసాబ్’ టికెట్లు అమ్ముడవుతుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, జనవరి 12 న విడుదలవుతున్న శంకర వరప్రసాద్ సినిమాకు కూడా ప్రభుత్వం మరో జీవో జారీ చేసి టికెట్ రేట్లను పెంచింది. ఒకవైపు టికెట్ ధరలు పెంచబోమని ప్రకటించడం, మరోవైపు వరుసగా జీవోలు జారీ చేయడం ప్రభుత్వ వైఖరిపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలపై సినీ ప్రేక్షకులు, సినీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన, సమానమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ‘పుష్ప–2’ సినిమా తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పానని, అందుకే ఇప్పుడు నన్ను ఎవ్వరూ కలవడం లేదని ఆయన తెలిపారు. ‘పుష్ప–2’ విడుదల సమయంలో జరిగిన విషాద ఘటనపై బాధ వ్యక్తం చేస్తూ, గాయపడిన బాలుడి చికిత్స ఖర్చులు తానే భరించానని చెప్పారు. అయితే ఇప్పుడు సినిమాలకు పెరిగిన టికెట్ ధరలకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేయడం, జీవోలపై అసలు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నను మరింత బలపరుస్తోంది.