
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో ఆమిర్ ఖాన్ మరోసారి చేతులు కలపబోతున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామాకు ‘లాల్కారా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమిర్ ఖాన్, అశుతోష్ గోవారికర్ కాంబినేషన్‌కు బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘బాజీ’ (1995), ‘లగాన్’ (2001) చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా ‘లగాన్’ భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చాలా ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మరో స్పోర్ట్స్ డ్రామాతో కలవనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమిర్ ఖాన్ మరోసారి భారీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘లాల్కారా’లో ఆయన సుమారు 25 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రను తెరపై సహజంగా, నమ్మశక్యంగా చూపించేందుకు ఆమిర్ ఇప్పటికే బరువు తగ్గే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన పాత్రల కోసం శారీరకంగా పూర్తిగా మారిపోవడంలో ఆమిర్ ఖాన్‌కు మంచి పేరుంది. గతంలోనూ ‘దంగల్’ వంటి సినిమాల కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘లాల్కారా’ కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, ఆమిర్ లుక్, షూటింగ్ వివరాలను చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో మరో స్పోర్ట్స్ డ్రామాలో ఆమిర్ కనిపించనున్నారనే వార్త నిజమైతే.. ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.













