director Badri: రియల్ లైఫ్‌లోనూ అనుపమ మొండిదే : ‘క్రేజీ కళ్యాణం’ దర్శకుడు

Director Badri

director Badri: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు తరుణ్ భాస్కర్, నరేష్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బద్రప్ప గాజుల (బద్రి) చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డెడికేషన్, సెట్లో తమ మధ్య జరిగిన గొడవలు, కథ వెనుక ఉన్న ఆసక్తికర నేపథ్యాన్ని ఆయన విడమరిచి చెప్పారు.

అనుపమ నటన, పాత్ర పట్ల ఆమె చూపిన నిబద్ధత గురించి డైరెక్టర్ బద్రి మాట్లాడుతూ.. “అనుపమ చాలా హుషారైన అమ్మాయి. క్యారెక్టర్ విన్నప్పటి నుంచే స్క్రిప్ట్‌ను ఎంతో లోతుగా అధ్యయనం చేసింది. ఒక్క సీన్‌లో కూడా పాత్ర సహజత్వాన్ని వదల్లేదు. కొన్ని సందర్భాల్లో మగాడి కోణంలో నేను రాసిన సీన్లపై ఆమె నాతో కొట్లాడింది కూడా! ‘నేను ఆ స్థానంలో ఉంటే ఇలా చేయను’ అంటూ క్యారెక్టర్ కోసం సూచనలు ఇచ్చేది. సినిమాలో ఆమె పాత్ర ఎంత మొండిగా ఉంటుందో, బయట కూడా అంతే మొండిగా పాత్రను ఓన్ చేసుకుంది” అని ప్రశంసించారు. ఆమె ఇన్పుట్స్ వల్లే పాత్ర మరింత రియలిస్టిక్‌గా మారిందని స్పష్టం చేశారు.

ఈ చిత్ర కథ ఎలా పుట్టిందో వివరిస్తూ.. డిగ్రీ చదువుకునే రోజుల్లో జరిగిన వాస్తవ సంఘటనలను దర్శకుడు గుర్తు చేసుకున్నారు. “మేము చదువుకునే టైంలో క్లాస్‌మేట్స్ పెళ్లిళ్లకు వెళ్లేవాళ్లం. స్టేజ్ మీద క్లాస్ రూమ్ మొత్తం చేరి సందడి చేస్తుంటే, మధ్యలో పెళ్లికూతురు అలా నిలబడి ఉండేది. చుట్టూ అంతా నవ్వుతున్నా.. ఆ అమ్మాయి మనసులో ఎలాంటి ఆశలు, లక్ష్యాలు నలుగుతున్నాయో ఎవరూ పట్టించుకోరు. అదే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది” అని తెలిపారు.

అలాగే సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రానికి హీరో అని, ఆయన నటనకు తగ్గట్టుగానే స్క్రీన్‌పై ‘నవరస రాయ’ అనే బిరుదు వేశామని చెప్పారు. ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి సొంత బిడ్డ పెళ్లి చేసినంత బాధ్యతగా సినిమాను నిర్మించారని, తరుణ్ భాస్కర్ బిజీ షెడ్యూల్‌లోనూ క్యారవాన్‌లో ఉంటూ సీన్లు రాసుకుని మరీ ‘బాలరాజు’ పాత్రను అద్భుతంగా పండించారని పేర్కొన్నారు. దిల్ రాజు, బన్నీ వాస్ మద్దతుతో అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.