Anurag Kashyap : అనురాగ్ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు.. ముంబై వాతావరణం నన్ను కుంగదీసింది

Anurag

Anurag Kashyap : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చిత్ర పరిశ్రమ పరిస్థితులపై, తన వ్యక్తిగత అనుభవాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై వాతావరణం తనను మానసికంగా దెబ్బతీసిందని, చాలామంది తాను రామ్ గోపాల్ వర్మ మార్గంలో నడుస్తున్నాడని వ్యాఖ్యానించారని తెలిపారు. ఆ కారణంగానే ముంబై వదిలి దక్షిణాదికి వచ్చానని, ఇక్కడ ప్రశాంత జీవితం గడుపుతున్నానని వెల్లడించారు.

“హిందీ సినీ పరిశ్రమలో నిర్మాతలు కేవలం బాక్సాఫీస్ లెక్కలపైనే దృష్టి సారిస్తున్నారు. సృజనాత్మకతకు విలువ ఇవ్వడం లేదు. నేను నేరుగా నా అభిప్రాయాలను చెప్పడం వల్ల నన్ను దూరం పెట్టారు. నాతో ఉంటే స్టూడియోల నుంచి అవకాశాలు రాకపోవచ్చని అనుకుని చాలామంది వెనకడుగు వేశారు” అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ఎంతో ఇష్టపడి చేస్తున్న ‘మాగ్జిమమ్ సిటీ’ ప్రాజెక్ట్ ఆకస్మికంగా ఆగిపోవడం తనను మరింత కుంగదీసిందని చెప్పారు. ఆ సమయంలో హిందీ సినిమాలు పూర్తిగా మానేసి, కొత్త దర్శకుల సినిమాలు, ముఖ్యంగా మలయాళ చిత్రాలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టానని వెల్లడించారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

దక్షిణాదికి వచ్చిన తరువాత తన జీవితంలో పాజిటివ్ మార్పులు చోటుచేసుకున్నాయని అనురాగ్ వివరించారు. “ఇక్కడ అవసరం లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాంతో నాకు మానసిక ప్రశాంతత లభించింది. వ్యాయామం, రాయడం వంటి అలవాట్లను తిరిగి మొదలుపెట్టాను” అని అన్నారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్‌ దక్షిణాది ప్రాజెక్టులపై దృష్టి సారించారు. అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతకుముందు ఆయన నటించిన ‘రైఫిల్ క్లబ్’ చిత్రంలోనూ ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.