
Chandra Siddharth: విలక్షణమైన స్టోరీలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. తాజాగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సినిమాను రూపొందించారు. ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హర్ష ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా.. అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చంద్ర సిద్ధార్థ్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా భిన్నమైన కథాంశంతో రూపొందినట్లు తెలుస్తోంది. ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేకర్స్ మిస్టరీ మ్యూజికల్‌గా పేర్కొంటున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలక అంశంగా మలిచారు.
సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవిస్తూ ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ను రూపొందించారు. సినిమాలో సంగీతానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చిత్రబృందం చెబుతోంది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉండగా.. జే రెక్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా టైటిల్ గురించి దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రతి రోజు రాత్రి సరిగ్గా 10:30 గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతుంటుందని.. నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి తదితరులు ఆ పాటను కోరుకుంటూ ఉంటారని ఆయన వివరించారు. ఈ కథాంశం ఆధారంగానే సినిమాకు ఇంత పొడవైన టైటిల్‌ను పెట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమా తన స్నేహితుడు, దర్శక రచయిత మదన్‌తో కలిసి చేయాలనుకున్న ప్రాజెక్ట్ అని చంద్ర సిద్ధార్థ్ తెలిపారు. మదన్ మరణానికి ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇదొకటని, గతంలో ఆయన కథతోనే ‘ఆ నలుగురు’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి మదన్ కథ అందించగా, చంద్ర సిద్ధార్థ్ పాటలు రాశారు, పులగం చిన్నారాయణ సంభాషణలు అందించారు. అగస్త్య మంజు, సాగర్, మహి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వై.వి. సత్యనారాయణ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాకు నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను చంద్ర సిద్ధార్థ్ నిర్వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.











