Fake Casting Calls: ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై వైజయంతీ మూవీస్ కీలక ప్రకటన.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక!

Fake Casting Calls

Fake Casting Calls: ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరుతో జరుగుతున్న నకిలీ కాస్టింగ్ కాల్స్‌పై మేకర్స్ తాజాగా అప్రమత్తం చేశారు. తమ బ్యానర్‌లో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు ఫేక్ కాస్టింగ్ కాల్స్, మెసేజ్‌లతో ఔత్సాహిక నటులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించింది. తమ రాబోయే సినిమాలు, ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కాస్టింగ్ అవకాశాలపై ఏదైనా అధికారిక ప్రకటన ఉంటే.. దాన్ని కేవలం వైజయంతీ మూవీస్‌కు చెందిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇతర వ్యక్తులు, అనధికారిక ఖాతాలు లేదా ఏజెంట్ల ద్వారా వచ్చే కాస్టింగ్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించింది.

అవకాశాలు ఇప్పిస్తామంటూ వ్యక్తిగతంగా సంప్రదించే ఏజెంట్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులని నమ్మి ఎలాంటి డబ్బు చెల్లించవద్దని మేకర్స్ సూచించారు. సంస్థ పేరును దుర్వినియోగం చేస్తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సినిమాల్లో నటించే అవకాశం కోసం ప్రయత్నిస్తున్న ఔత్సాహికులు ఇలాంటి నకిలీ ప్రకటనల బారిన పడకుండా.. కాస్టింగ్‌కు సంబంధించిన సమాచారం కోసం వైజయంతీ మూవీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సంస్థ సూచించింది. ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన తమ సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే అనౌన్స్‌మెంట్లను మాత్రమే నమ్మాలని స్పష్టం చేసింది.