CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో


ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ జంటగా నటించిన తాజా చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను బొల్లా రామకృష్ణా రెడ్డి (బీఆర్‌కే) నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలు గడ్డం రమణారెడ్డి చేపట్టారు. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన చిత్రబృందం, సినిమా కథనంతో పాటు ఇందులో ఉన్న సామాజిక అంశాలను వివరించారు. ఈ సందర్భంగా దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ, “ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన సతీమణి ప్రజలను కలుస్తే, వారి సమస్యలు వింటే మార్పు తడుపుతుంది” అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుందని చెప్పారు. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడే ప్రస్తుత వ్యవస్థపై ప్రశ్నలతో కూడిన ఈ చిత్రం, ప్రజలలో కొత్త ఆలోచనను నాటాలనే లక్ష్యంతో తీసినదని తెలిపారు. యువత గురించి, రాజకీయాల్లో తలెత్తుతున్న అనేక సమకాలీన విషయాలపై కూడా ఈ సినిమా స్పందిస్తుందని అన్నారు.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

నటుడు అజయ్ మాట్లాడుతూ, “ఇప్పటి రోజుల్లో బౌండ్ స్క్రిప్ట్‌తో సినిమాలు తక్కువగా వస్తున్నాయి. కానీ రమణారెడ్డి గారు పూర్తిగా సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్‌తో వచ్చారు కాబట్టి సినిమా చేయాలని ఒప్పుకున్నాను. ఈ సినిమా కంటెంట్ ఉమన్ ఎంపవర్‌మెంట్ మీద కూడా దృష్టి సారించింది,” అని తెలిపారు. నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా రాజకీయ నాయకులు ప్రజలతో ఎలా మమేకమవాలనే విషయాన్ని సున్నితంగా చూపుతుందని, తాను రాజకీయాల్లో లేకపోయినా, ప్రజాసేవ అనే ఆవశ్యకతను ఈ కథలో చూడగలమని పేర్కొన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ ఒక మెసేజ్‌తో కూడినదని, యువతతో పాటు ప్రతి ప్రేక్షకుడు దీనిలో మెసేజ్‌ను గ్రహించగలడని తెలిపారు. ముఖ్యంగా, అజయ్, ఇంద్రజ వంటి గొప్ప నటుల భాగస్వామ్యం ఈ చిత్రానికి పెద్ద బలం అని అన్నారు. సమాజానికి శుభవార్త అందించే ప్రయత్నంగా ఈ సినిమాను తీసినందుకు చిత్రబృందం ప్రశంసలందుకుంటోంది.