
Sudha Kongara: ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగర (ఆకాశమే నీ హద్దురా ఫేమ్) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం ‘పరాశక్తి’. ఈ సినిమాకి గానూ ఆమెకి రావలసిన రూ.8.39 కోట్ల బకాయి రెమ్యూనరేషన్‌ను ఇప్పించాలంటూ తాజాగా ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. జూలై 8వ తేదీ వరకు ‘పరాశక్తి’ చిత్ర శాటిలైట్ విడుదలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే.. ‘డాన్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘పరాశక్తి’ సినిమాకు గానూ సుధా కొంగరకు రూ.15 కోట్ల పారితోషికం (జీఎస్టీతో కలిపి రూ.17.70 కోట్లు) ఇవ్వాలని డీల్ కుదిరింది. అయితే సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినా, ఇప్పటివరకు ఆమెకు కేవలం రూ. 9.31 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ. 8.39 కోట్లు ఇంకా బకాయి ఉన్నట్లు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాను పారితోషికం అడుగుతుంటే.. డబ్బులు లేవని చెబుతున్న సదరు నిర్మాణ సంస్థ, తమ తదుపరి చిత్రం ‘ఇదయం మురళి’ రిలీజ్‌కు రెడీ చేయడంపై సుధా కొంగర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చే డబ్బులు చెల్లించే వరకు జూలై 10న విడుదల కాబోతున్న ‘ఇదయం మురళి’ సినిమా రిలీజ్‌పై కూడా స్టే ఇవ్వాలని సుధా కొంగర తన పిటిషన్‌లో కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ విషయమై జూలై 7 లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సదరు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ వివాదం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














