Jayam Ravi: “కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా”.. జయం రవి సంచలన ప్రకటన! విడాకుల వివాదానికి ఎండ్ కార్డ్?

Jayam Ravi

Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో, ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ జయం రవి (Jayam Ravi) తన పర్సనల్ లైఫ్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. భార్య ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడి, విమర్శలు ఎదుర్కొన్న ఆయన.. మొదటిసారిగా ఈ వివాదంపై బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా జీవితంలో సగానికి పైగా కాలాన్ని నేను వెండితెరకే అంకితం చేశాను. కానీ, ఇప్పుడు నా జీవితంలో ఒకే ఒక్క పశ్చాత్తాపం మిగిలిపోయింది. నేను తీసుకున్న ఒక వ్యక్తిగత నిర్ణయం (విడాకులు) నా కుటుంబాన్ని, నన్ను ప్రాణంగా ప్రేమించే నా అభిమానులందరినీ ఎంతగానో బాధించింది” అని పేర్కొన్నారు.

గతాన్ని మర్చిపోయి సరికొత్తగా కెరీర్‌ను ప్రారంభించబోతున్నట్లు జయం రవి స్పష్టం చేశారు. “నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ గుండెల్లో నిలిచిపోయిన సంతోష్ (సంతోష్ సుబ్రమణ్యం), కుమరన్, ధ్రువన్ (పేరన్మై), మిథ్రన్ (తని ఒరువన్), అరుల్మొళి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్) మరియు కరాటే బాబుగా.. మీ జయం రవిగా మరింత పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా మీ ముందుకు తిరిగి వస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆయన తన అభిమానుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ మరింత ఎమోషనల్ అయ్యారు. “మీ అందరి ముందు నేను మోకాళ్లపై నిలబడి అడుగుతున్నాను.. దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే పెద్ద మనసుతో మన్నించండి. మీ అందరికీ ఒకే ఒక్క మాట ఇస్తున్నాను.. ఇకపై ఏ విషయంలోనూ మిమ్మల్ని బాధించను, నమ్మకద్రోహం చేయను” అంటూ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.