
Kajal Aggarwal: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటిస్తోందంటూ వస్తున్న వార్తలపై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తాను ఒక కీలక పాత్రలో భాగమైనట్లు కాజల్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఒక అవార్డుల వేడుకలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ ‘రామాయణం’ ప్రాజెక్టుపై స్పందించారు. ఈ చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. “ఇండియాలో ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతమైన సాంకేతిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ లంకాధిపతి రావణుడి భార్య ‘మండోదరి’ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రలో కాజల్ ఎలా మెప్పించబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా.. రెండో భాగాన్ని 2027 లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాజల్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ బెల్ట్‌లో అంచనాలు మరింతగా పెరిగాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











