
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ విజువల్ వండర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మాట్లాడిన మాటలు ఆడియన్స్‌లో నెక్ట్స్ లెవల్ హైని కలిగించాయి. సినిమా కథా నేపథ్యం గురించి ఆయన లీక్ చేసిన ఇంటెన్సిటీ టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. సినిమా నేపథ్యాన్ని వర్ణిస్తూ కాసర్ల శ్యామ్ వేదికపై గూస్‌బంప్స్ తెప్పించే కవిత్వాన్ని వినిపించారు. “ఇది మామూలు ప్యారడైజ్ కాదు.. నెత్తుటి గింజల పైన మొలిసిన రాజ్యం! గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం ఇది. ఈడ ఎండిపోయిన బొక్కలే ఎగిరే జెండా కర్రలు.. మాడిపోయిన డొక్కలే మోగేటి నగారాలు! ఈ సవారీల కథను చదివితే పుస్తకానికే పూనకం వస్తది.. వాళ్ల సప్పుడు వింటే చరిత్ర దర్వాజా తీస్తది” అంటూ సినిమా తీవ్రతను చాటిచెప్పారు. మొదటి నుంచి చివరి వరకు థియేటర్లలో ప్రేక్షకులు ఉడికిపోతారని, ఆడిటోరియాలన్నీ డ్యాన్స్ ఫ్లోర్‌లుగా మారబోతున్నాయని జోస్యం చెప్పారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ.. “దసరా సినిమాతో మా ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం ‘ది ప్యారడైజ్’తో మరింత బలపడింది. మీరందరూ ముద్దుగా పిలుచుకునే మెంటలోడికి ఇక్కడ ఇంకో మెంటలోడు దొరికాడు. కథ, ‘జడల్’ అనే క్యారెక్టర్, ప్యారడైజ్ ప్రపంచాన్ని శ్రీకాంత్ నా బుర్రలోకి ఫుల్లుగా ఎక్కించేశాడు. దొరలు తాగే ఇప్పసారాయి నా చేత తాగించినట్టు అయిపోయింది. నాని ట్రాన్స్‌ఫార్మేషన్ చూశాకే ‘ఆయా షేర్’ పాట రాశాను. మొదట ‘నన్ను చంపుతావా’ అని రాస్తే.. శ్రీకాంత్ కసితో ‘చంపుతావా కాదు అన్నా.. నన్ను వీకుతావా అని రాయి’ అని మార్పించాడు. అంత మొండోడు శ్రీకాంత్” అని వెల్లడించారు.
చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘ఏషనాగుల’ పాట వెనుక కథను వివరిస్తూ.. 35 ఏళ్లుగా ఆ పాటను కోలాటం వేదికలపై పాడుతూ సజీవంగా ఉంచిన పాలమూరు జానపద కళాకారుడు జంగిరెడ్డికి, పాలమూరు కళాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఎక్కడా అశ్లీలం, బూతు లేకుండా.. ఐటెం సాంగ్ కాకుండా ఒక స్వచ్ఛమైన మొరటు ప్రేమని చెప్పేందుకు ఆ జానపద లైన్లను హుక్ లైన్‌గా తీసుకున్నాం. ‘గుమగుమ నీ వాసన మోసిన నా ఒళ్ళు.. ఎన్నడో మరిచిపాయే ఎచ్చని నీళ్లు’ లాంటి ప్యూర్ లిరిక్స్ రాసే స్వేచ్ఛను శ్రీకాంత్ ఇచ్చాడు” అని వివరించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి చెబుతూ.. “అందరికీ ఆయన అని గాడ్.. కానీ నా పెద్ద కొడుకు పేరు కూడా అనిరుద్ధే కాబట్టి నా బాయ్ అంటాను. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ‘మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్’ అని కాళ్లకు మొక్కిన వినమ్రత ఆయనది. సినిమాలో రీ-రికార్డింగ్ (RR) కోసం తల్లి-కొడుకుల సెంటిమెంట్‌పై మరో నాలుగు అద్భుతమైన బిట్ సాంగ్స్ రాశాను” అని సీక్రెట్ రివీల్ చేశారు. ఇక సంపూర్ణేష్ బాబు పాత్ర గురించి చెబుతూ.. “పొట్లం కట్టిన బిర్యానీకి ప్యాంట్ షర్ట్ తొడిగితే ఎలా ఉంటుందో సంపూ క్యారెక్టర్ అలా ఉంటుంది” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా, కాసర్ల శ్యామ్ చెప్పిన పవర్ ప్యాక్డ్ డైలాగులు, లిరికల్ డెప్త్ చూస్తుంటే సెప్టెంబర్ 24న నాని ‘జడల్’గా బాక్సాఫీస్ వద్ద రక్తపాతం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.













