Kiran Abbavaram: రైటర్‌గా హిట్టు కొట్టాడు.. ఇప్పుడు డైరెక్టర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కిరణ్ అబ్బవరం! రేపే ముహూర్తం..

Kiran Abbavaram

Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం సినీ కెరీర్‌లో సరికొత్త అడుగు వేయబోతున్నారు. వైవిధ్యమైన కథలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారనున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించనున్న ఆయన 13వ చిత్రం (#KA13) శుక్రవారం ముహూర్తపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా స్టార్ట్ కానుంది.

Also Read :  SSMB30: బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్.. బుచ్చిబాబుతో - మహేష్ బాబు సినిమా? 'SSMB30'పై క్రేజీ లీక్!

‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం, గతంలో తన సూపర్ హిట్ చిత్రం ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’కు కథ, స్క్రీన్‌ప్లే అందించి రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి బాధ్యతలతో దర్శకుడి అవతారమెత్తి తనలోని మల్టీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఓవర్సీస్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ఈ చిత్రం ద్వారా ‘జాయ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ఒక డిఫరెంట్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. రేపు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.