
Megastar Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’ (#MaaIntiBangaaram) చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మెగాస్టార్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరులతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. సినిమా సాధించిన విజయాన్ని అడిగి తెలుసుకున్న మెగా బాస్.. చిత్ర యూనిట్ ప్రతిభను, కష్టాన్ని ప్రశంసించారు. చిరంజీవి వంటి పెద్దల ఆశీస్సులు లభించడం తమకు కొండంత బలాన్ని ఇచ్చిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
మా ఇంటి బంగారం కథ ఇదే..
పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అనిరుధ్ (దిగ్నాథ్ మంచాలే), తన చెల్లెలి పెళ్లి జరుగుతుందని తెలుసుకుని, ఆ పెళ్లికి తన భార్య స్వర్ణ (సమంత)తో కలిసి సొంత ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్లే క్రమంలో, అనుకోకుండా ఆమె కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషుల కంటపడుతుంది. సొంత ఊరికి వెళ్లాక స్వర్ణ తన భర్త కుటుంబంలో కలిసిపోయే ప్రయత్నం చేస్తుండగా, మరోపక్క కరుణ ఆమెను ట్రేస్ చేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనకు వంట రాకపోయినా, తన స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని మరి వంటలు చేసి బిజీగా ఉన్న స్వర్ణ, అనుకోకుండా కరుణ కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ కారణంగా ఏకంగా కుటుంబానికే ఆపద ఏర్పడుతుంది. ఆపద నుంచి ఆ కుటుంబం గట్టెక్కిందా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.











