
Kannappa Special Show : విష్ణు మంచు నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం దేవతా తత్వంతో కూడిన భక్తిరస కథనంతో ప్రేక్షకులను అలరిస్తోంది. డివోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా, విజయవాడలో సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘కన్నప్ప’కి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా, ఆ ప్రదర్శనలో ప్రముఖ నటుడు డా. ఎం. మోహన్ బాబు కూడా హాజరయ్యారు.
ఈ స్పెషల్ షో ప్రత్యేకత ఏమిటంటే, మోహన్ బాబు తో పాటు అనేకమంది అఘోరాలు, నాగ సాధువులు, యోగినీలు ఈ చిత్రాన్ని ఒకే చోట కలసి చూశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు, ‘‘ప్రతి చోట ‘కన్నప్ప’ సినిమాకి అద్భుత స్పందన లభిస్తోంది. నా కొడుకు విష్ణు నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. విజయవాడలో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక షోను నాగ సాధువులు, సాధువులు, అఘోరాల మధ్య చూసిన అనుభూతి మరపురానిది” అని పేర్కొన్నారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకు రావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధవులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు’ అని అన్నారు.









