72nd National Film Awards: 72వ జాతీయ అవార్డుల్లో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’..

Committee Kurrollu

72nd National Film Awards: తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి జాతీయ స్థాయిలో చాటిచెప్పింది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమా రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు మేకప్ విభాగంలోనూ అవార్డును దక్కించుకుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. యదు వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడం చిత్ర యూనిట్‌కు మరో మైలురాయిగా మారింది. మేకప్ విభాగంలో పి. రవికుమార్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, దర్శకుడు యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. గామా, సైమా, ఫిల్మ్‌ఫేర్ వంటి అవార్డు వేడుకల్లోనూ చిత్ర బృందం గుర్తింపు పొందింది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.18.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి మొత్తం రూ.24.5 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. 16 మంది కొత్త నటీనటులను పరిచయం చేసిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.