
Irumudi: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ నమ్మకంతో ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభ దశలో కథ, కాన్సెప్ట్‌పై నమ్మకం ఉన్నప్పటికీ.. ఓటీటీ రైట్స్ విషయంలో మాత్రం మొదట్లో అనుకున్నంత ఆసక్తి కనిపించలేదనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తొలుత ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.
అయితే ఓటీటీ మార్కెట్ నుంచి వెంటనే స్పందన రాకపోయినా మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గలేదట. కథ, రవితేజ పాత్ర, శివ నిర్వాణ టేకింగ్‌పై ఉన్న నమ్మకంతో సినిమాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల రిస్క్ కి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ మొదలైన తర్వాత పరిస్థితులు మారిపోయాయని సమాచారం. ముఖ్యంగా ‘ఇరుముడి’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిందట. రవితేజను కొత్త తరహా పాత్రలో చూపిస్తున్నారనే విషయం బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రేజ్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్.. ఆ తర్వాత ‘ఇరుముడి’ డిజిటల్ రైట్స్ కోసం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. చివరకు మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు థియేటర్లలో ‘ఇరుముడి’కు వస్తున్న స్పందన చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న రిస్క్ వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. సినిమా విజయంతో నిర్మాతలతో పాటు ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు తీసుకున్న సాహసం.. ‘ఇరుముడి’ విజయంతో మంచి ఫలితాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.














