
NBK Koratala: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కోరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అమరావతి వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్ర అధికారిక పూజా కార్యక్రమాలు వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరగనున్నాయని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఈ మూవీ లాంచ్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ రానున్నారు. చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించి, వారు క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ ఇమేజ్, కోరటాల శివ సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ మేకింగ్ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మాస్ ప్రేక్షకులను ఊపేసే బాలయ్యను, తనదైన క్లాస్ అండ్ మాస్ ఎలివేషన్లతో కోరటాల శివ వెండితెరపై ఏ రేంజ్‌లో చూపించబోతున్నారోనని నందమూరి అభిమానులు, సినీ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.












