
Animation Film: సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ అవసరం లేదని నిరూపిస్తోంది ఓ చైనీస్ యానిమేషన్ చిత్రం. కేవలం కొన్ని వందల డాలర్లతో రూపొందిన ‘నియు లాయ్’ (Niu Lai) ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా.. సోషల్ మీడియా వైరల్‌తో ఏకంగా మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతోంది. ‘నియు లాయ్’ ఆగస్టు 5న చైనాలోని థియేటర్లలో విడుదలైంది. తొలి రోజుల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. విడుదలైన మొదటి పది రోజుల్లో కేవలం 10 వేల యువాన్ (సుమారు 1,400 డాలర్లు) మాత్రమే వసూలు చేసినట్లు స్థానిక బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. కొన్ని రోజుల్లో అయితే రోజువారీ వసూళ్లు కేవలం 200 యువాన్ వరకు మాత్రమే నమోదయ్యాయట.
అయితే సినిమా యానిమేషన్ నాణ్యత, విచిత్రమైన విజువల్స్, కథనంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలే చివరకు దానికి అతిపెద్ద ప్రచారంగా మారాయి. సినిమాకు సంబంధించిన క్లిప్స్, మీమ్స్, ప్రేక్షకుల రియాక్షన్స్ విపరీతంగా వైరల్ కావడంతో.. అసలు సినిమా ఎలా ఉందో చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా బాక్సాఫీస్ వసూళ్లు భారీగా పెరిగాయి. రాయిటర్స్ ప్రకారం.. ఆగస్టు 20 నాటికి ‘నియు లాయ్’ చైనా బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. రోజువారీ బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో ఇది హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తర్వాతి స్థానంలో నిలవడం విశేషం. ఇక ఈ సినిమా నిర్మాణ వ్యయం విషయంలోనూ ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు నివేదికల ప్రకారం ‘నియు లాయ్’ బడ్జెట్ సుమారు 200 డాలర్లుగా చెప్పబడుతోంది. అయితే ఇతర నివేదికల్లో ఖర్చు కొన్ని వేల డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. అందువల్ల 200 డాలర్ల బడ్జెట్ అనే సంఖ్యను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అమేచ్యూర్ యానిమేటర్ షిన్ యుమెంగ్, ఆయన తల్లి సన్ లిఫాంగ్ కలిసి సుమారు ఐదేళ్ల పాటు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. భారీ స్టూడియో, స్టార్ కాస్ట్, కోట్ల రూపాయల బడ్జెట్ లేకుండానే ‘నియు లాయ్’ సాధిస్తున్న విజయం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.









