
Pradeep Rawat: ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. బ్లడ్ క్లాట్ కారణంగా గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రదీప్ రావత్ తన ప్రత్యేక నటనతో భాషలకు అతీతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘లగాన్’ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం దక్షిణాది చిత్రాల్లోకి అడుగుపెట్టి విలన్ పాత్రలతో విశేష ఆదరణ పొందారు.
తెలుగులో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో ప్రదీప్ రావత్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్ర ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమా విజయంతో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకున్నారు. దక్షిణాది చిత్రసీమలో 70కు పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. తెలుగులో ఆయన చివరిసారిగా ‘గాయపడ్డ సింహం’ సినిమాలో కనిపించారు. వ్యక్తిగత జీవితంలో తన ఒక్కగానొక్క కుమారుడిని హీరోగా చూడాలని ప్రదీప్ రావత్ ఎంతో ఆశపడ్డారని, ఆ కల నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని వీడడం కుటుంబ సభ్యులను, అభిమానులను మరింత కలచివేసింది. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ ప్రతిభావంతమైన నటుడిని కోల్పోయింది.














