Priyamani: రామానాయుడు స్టూడియోస్ గోడపై నా ఫొటో చూడాలనుకున్నా!

Priyamani

Priyamani: కెరీర్ స్టార్టింగ్‌లో రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్న టైంలో ఒక గోడపై ఎంతోమంది ప్రముఖ నటీమణుల ఫొటోలు అందంగా అలంకరించి ఉండటం చూశానని ప్రియమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. “అప్పట్లో వాటి ప్రాధాన్యత నాకు పూర్తిగా తెలియదు. కానీ, వారంతా ప్రతిష్ఠాత్మక ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌లో నటించిన లెజెండరీ హీరోయిన్లు అని ఆ తర్వాత తెలిసింది. ఆ రోజే నా మనసులో ఒక బలమైన కోరిక కలిగింది.. ఎలాగైనా భవిష్యత్తులో ఆ గోడపై నా ఫొటో కూడా స్థానం సంపాదించుకోవాలని అనుకున్నాను” అని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read :  Peddhi Movie Budget: "పెద్ది" బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

‘నారప్ప’తో నెరవేరిన దశాబ్దాల కల
ఆమె అనుకున్నట్లుగానే కొన్ని సంవత్సరాల తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘నారప్ప’ రూపంలో ప్రియమణికి అద్భుతమైన అవకాశం వచ్చింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ డ్రామాలో ఆమె పోషించిన ‘సుందరమ్మ’ పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో పనిచేయాలనే తన దశాబ్దాల కల ఈ సినిమాతో నెరవేరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. ‘నారప్ప’ చిత్రాన్ని ఆయన ఎంతో అద్భుతంగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. ఆ సినిమాలో నటించడం వల్లే ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఆ లెజెండరీ హీరోయిన్ల ఫొటోల పక్కన నా ఫొటో కూడా చేరింది. నా లైఫ్ టైమ్ కోరిక నెరవేరడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.