Varalaxmi Sarathkumar : దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్.. ‘సరస్వతి’ తో కొత్త అడుగు

Saraswathi
Varalaxmi Sarathkumar : విలక్షణ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. కేవలం నటనతో పరిమితం కాకుండా, దర్శకనిర్మాతగా కొత్తగా అవతారం ఎత్తి, తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి ‘డోస డైరీస్’ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా ‘సరస్వతి’ రాబోతుంది. “దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది. మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి” అని వరలక్ష్మి శరత్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు

ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ కనిపిస్తుండటం విశేషం. ఇక టైటిల్ పోస్టర్‌లో ‘సరస్వతి’ అనే పేరులో ‘తి’ అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం, సినిమాపై ఉత్కంఠను పెంచుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, యువ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీత అందిస్తుండగా, ఎ.ఎమ్. ఎడ్విన్ సకాయ్ సినిమాటోగ్రఫీ, వెంకట్ రాజన్ ఎడిటింగ్, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్షన్, ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాణం నిర్వహిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.