
Raghava Lawrence: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సీఎం సి.జోసెఫ్ విజయ్ పార్టీలోకి మరో ప్రముఖ సినీ నటుడు చేరారు. ఆయనే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. తాజాగా ఆయన టీవీకే పార్టీలో చేరడమే కాకుండా.. ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాఘవ లారెన్స్.. ఇప్పుడు అధికారికంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరిన ఆయనకు, విజయ్ కీలక బాధ్యతలను అప్పగించారు. తాజా ఎన్నికల్లో సీఎం విజయ్ పోటీ చేసి గెలిచిన తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గ ఉపఎన్నికల బరిలో రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం.
తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న విజయ్.. ఉపఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాఘవ లారెన్స్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. లారెన్స్‌కు ఉన్న మాస్ ఇమేజ్, ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఉన్న ఆదరణ పార్టీకి భారీగా కలిసి వస్తుందని విజయ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రాఘవ లారెన్స్.. ఇప్పుడు సీఎం విజయ్ అండతో పొలిటికల్ పోరులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో, తిరుచ్చి ఈస్ట్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి. లారెన్స్ రాజకీయ ఎంట్రీ ఇవ్వడం, అది కూడా తిరుచ్చి ఈస్ట్ నుంచి నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో తమిళనాడు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. లారెన్స్ పోటీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












