Bad Girlz : రేణు దేశాయ్ కీలక పాత్రలో ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం

Badgirlz
Bad Girlz : ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మున్నా ధులిపూడి ఇప్పుడు మరో విభిన్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన డైరెక్షన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. టైటిల్‌తోనే కాస్త షాకింగ్‌గా అనిపించినా, ట్యాగ్‌లైన్‌గా పెట్టిన ‘కానీ చాలా మంచోళ్లు’ అనే మాట సినిమా వెనక ఉన్న ఎమోషన్‌ను తెలియజేస్తుంది. ఈ చిత్రంలో అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణచైతన్య ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ.. “బాహుబలిలో బిడ్డను కాపాడే చేయిలా నాకు చేయందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం చంద్రబోస్ గారు, అనూప్ గారే. నీలి నీలి ఆకాశం పాట పేరుతోనే నేను బ్యానర్ పెట్టుకున్నా. నేను ఎప్పుడు సినిమాలు చేసినా వీళ్లిద్దరితోనే చేస్తా. మా కాంబినేషన్‌లో మళ్లీ అలాంటి పాట రాబోతోంది. 10 రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తాం. అదొక మంచి ప్రీవెడ్డింగ్ సాంగ్ అవుతుంది. ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. నేను ఒకరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి బండి ఆపి చార్మినర్ దగ్గరకు వెళ్లి చాయ్ తాగుదామా అని అడిగింది. తను పెళ్లి తర్వాత ఫ్రీడం ఉండదని అలా లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పింది. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. ఈ కథను ఐదారుగురు పెద్ద నిర్మాతలకు చెప్పాను. కొత్త అమ్మాయిలతో మార్కెట్ అవుతుందా అని అడిగారు. అందుకే నేను, నా క్లాస్‌మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతాం. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. స్కూల్లో అమ్మాయిలను తమను తాము కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి. మా మూవీ టీమ్ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు, కేంద్రప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బ్యానర్ పెట్టడానికి కారణం డైరెక్టర్ మారుతి గారు. వాళ్ల స్ఫూర్తితోనే బ్యానర్ పెట్టాం. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. నీలినీలి ఆకాశం లాంటి సాంగ్ ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబుకు ఈ కథ చెబితే ఇది చిన్న సినిమా కాదు చాలా మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించాడు. సుకుమార్ గారికి టైటిల్ చెబితే అదిరిపోయిందన్నారు. ఈ నలుగురు అమ్మాయిలను లైఫ్‌లో మర్చిపోలేను. రేణూ దేశాయ్ గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నెక్ట్స్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు. అందరికీ థ్యాంక్యూ” అని అన్నారు.