
Sanjay Leela Bhansali: టాలీవుడ్లో పాన్ ఇండియా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వేస్తున్న ఎత్తుగడలే తాజా నిదర్శనం. చాలా కాలంగా ఒక క్రేజీ తెలుగు హీరోతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్న ఆయన, ఇప్పుడు ఏకంగా మన టాప్ స్టార్లపై కన్నేశారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా ముగ్గురు అగ్ర హీరోల చుట్టూ భన్సాలీ చర్చల పర్వం నడుస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఒక హీరో కాకపోతే మరో హీరోకి అదే స్క్రిప్ట్ వినిపించడం ఇండస్ట్రీలో చూస్తుంటాం. కానీ భన్సాలీ వ్యూహం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక భారీ స్క్రిప్ట్‌ను ఇప్పటికే వినిపించినట్లు సమాచారం. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయి మరో వైవిధ్యమైన కథను చర్చించినట్లు టాక్. ఇక ఇటీవలే సూపర్ స్టార్ మహేష్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమై, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయే కథను నరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోలను వేర్వేరు కథలతో సంప్రదించడం భన్సాలీ సీరియస్‌నెస్‌ను స్పష్టం చేస్తోందని అంటున్నారు.
స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నా, ఇక్కడ అసలైన సవాలు మరొకటి ఉంది. సంజయ్ లీలా భన్సాలీ మేకింగ్ స్టైల్ పూర్తి భిన్నం. ఆయన సినిమాల్లో రాజసం, భారీ సెట్లు, నాటకీయత ఎంత ఉంటుందో.. అంతే స్థాయిలో సమయం, సుదీర్ఘమైన కాల్షీట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం మన హీరోలు కమర్షియల్ మాస్ అంశాలతో పాటు వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారు. భన్సాలీకి ఉన్న విపరీతమైన పర్ఫెక్షనిజం, నెలల తరబడి సాగే వర్కింగ్ స్టైల్‌ను తట్టుకుని మన స్టార్ హీరోలు ఆ ‘విజువల్ మాయాజాలం’లోకి అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారా? ఈ ముగ్గురిలో మొదట ఆ సాహసం చేసే హీరో ఎవరనేది ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.














