
SS Rajamouli: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్.రాజమౌళి తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబంతో గడిపే సమయం దాదాపు ఉండదని, అందుకే తన కుటుంబ సభ్యులంతా తనతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. తన రోజు.. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో రాత్రి 10 గంటలు దాటే వరకు నిరంతరం బిజీగా ఉంటానని చెప్పారు. ఈ కఠినమైన షెడ్యూల్ వల్ల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమయం గడపడం చాలా కష్టమవుతుందని వెల్లడించారు.
ఈ కారణంగానే తన భార్య రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయతో పాటు కుటుంబ సభ్యులు తన సినిమాల పన్నుల్లో భాగస్వాములయ్యారని ఆయన చెప్పారు. ఇలా చేయడం వల్ల పని, కుటుంబం రెండింటినీ ఒకేసారి సమతుల్యం చేసుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. రాజమౌళి వర్క్ డెడికేషన్ గురించి సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పుకుంటుంటారు. ప్రతి సినిమాను అత్యంత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన కఠినంగా శ్రమిస్తారని తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













