Vishnu Vishal: రజనీకాంత్‌పై ట్రోల్స్‌.. సోషల్ మీడియాలో హీరో విష్ణు విశాల్ ఫైర్!

Vishnu Vishal

Vishnu Vishal: సూపర్ స్టార్ రజనీకాంత్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ తీవ్రంగా మండిపడ్డారు. తలైవా లాంటి ఒక మహోన్నత వ్యక్తి తనపై వస్తున్న ఊహాగానాలపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు కంగ్రాట్స్ చెప్పలేదంటూ సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ ప్రచారానికి తెరలేపారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో స్వయంగా రజనీకాంత్ మీడియా ముందుకు రావలసి వచ్చింది. “విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? నేను ఏం మాట్లాడినా, మాట్లాడకపోయినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు” అంటూ తలైవా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజాగా తన సరికొత్త చిత్రం ‘మట్టి కుస్తీ 2’ ప్రమోషన్స్ వేదికగా విష్ణు విశాల్ ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు.

Also Read :  అమరావతిలో ‘NBK 112’ ప్రారంభం.. క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్!

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల తీరును తప్పుబడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినీ పరిశ్రమలో ఒక సెలబ్రిటీ నాలుగు రోజులు మౌనంగా ఉంటే చాలు.. సోషల్ మీడియాలో తమకు తోచినట్లు సొంత కథలు, ఊహాగానాలు రాసేస్తున్నారు” అని విమర్శించారు. “భారతీయ సినీ రంగంలో రజనీకాంత్ సాధించిన విజయాలు, ఆయన సృష్టించిన ఇమేజ్ వేరే లెవెల్. అలాంటి గొప్ప వ్యక్తికి ఇంకొకరిపై అసూయ ఉంటుందనడం ముమ్మాటికీ సరికాదు” అని చెప్పుకొచ్చారు. చివరకు తలైవా మైక్ ముందుకు వచ్చి.. తనకు విజయ్‌పై ఎలాంటి కుళ్లు లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావడం చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. సినిమా రంగంలో నటీనటులు పాటించే వ్యక్తిగత మౌనాన్ని.. శత్రుత్వంగా మార్చి చూడొద్దని, కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి నెగెటివిటీని స్ప్రెడ్ చేయవద్దని విష్ణు విశాల్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.