
Jana Nayagan: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయకన్’ (హిందీలో ‘జన్ నేతా’)పై దేశవ్యాప్తంగా అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు మరో భారీ అప్డేట్ అందించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నార్త్ బెల్త్‌లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX), సినీపోలిస్ (Cinepolis) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లలో ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయనున్నట్లు అఫిషియల్‌గా జీ స్టూడియోస్ ప్రకటించింది. దీనితో విజయ్ సినిమాకు ఉత్తర భారత మార్కెట్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల లభించనుంది.
ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ జూలై 19 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “ఇది చివరిసారి… ఒక చారిత్రాత్మక ప్రయాణం. ఈ వీడ్కోలును రికార్డు స్థాయి వేడుకగా మార్చుకుందాం” అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.
One last time. One historic journey.
Zee Studios is proud to bring #JanaNayagan and #JanNeta across all National multiplexes including PVR INOX & Cinepolis to the North Indian audiences.
Advance Bookings Open: July 19th.
Lets make this farewell a record breaking celebration… pic.twitter.com/TyAxkU6FoW
— Zee Studios (@ZeeStudios_) July 18, 2026














