
Venky Atluri: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక మమితా బైజును ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక కారణాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. సినిమా సెట్స్‌లో మమితా బైజును అందరూ తమ చిన్న చెల్లెలిలా చూసుకునేవారని, ఆమెను ఎంతో ఆప్యాయంగా ట్రీట్ చేసేవారని చెప్పారు. ‘ప్రేమలు’ సినిమా చూసిన తర్వాతే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ పాత్రకు తమ టీమ్‌లో అందరి ఫస్ట్ ఛాయిస్ మమితా బైజునే అని వెంకీ అట్లూరి వెల్లడించారు. హీరో సూర్య కూడా ఈ పాత్రకు ఆమెనే సరైన వ్యక్తిగా భావించారని, దీంతో అందరూ కలిసి మమితానే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ విన్న వెంటనే మమితా బైజుకు కథ బాగా నచ్చిందని, ఆమె చాలా మంచి నేచర్ కలిగిన, క్రమశిక్షణతో ఉండే అమ్మాయి అని ఆయన ప్రశంసించారు. ఈ కామెంట్స్‌తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య – మమితా బైజు జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్, అనిల్ కపూర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య ఇందులో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించనున్నారు.














