NTR : ధూమ్ 4లో జూనియర్ ఎన్టీఆర్..? బాలీవుడ్ ఆఫర్ హాట్ టాపిక్..!

Dhoom 4

 

NTR : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదలై మొదటిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీకెండ్ ముగిసిన వెంటనే కలెక్షన్లు క్షీణించాయి. సోమవారం రోజున దేశవ్యాప్తంగా కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే రాబట్టడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించడంతో తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నా, విడుదల తర్వాత ఆ అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం హృతిక్ రోషన్ పాత్రను ఎక్కువ హైలైట్ చేసి, ఎన్టీఆర్‌ను సైడ్ క్యారెక్టర్‌లా చూపించారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనివల్ల కలెక్షన్లపై కూడా ప్రభావం పడింది. బాలీవుడ్ ఎంట్రీతో ఎన్టీఆర్ తప్పు చేశాడని ఆయన అభిమానులే భావిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇప్పుడు మరే ఇతర తెలుగు హీరో కూడా బాలీవుడ్ ఆఫర్లను సులభంగా అంగీకరించరనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

బాలీవుడ్‌లో భారీగా క్రేజ్ ఉన్న ‘ధూమ్’ ఫ్రాంఛైజీ నాలుగో భాగానికి సిద్ధమవుతోంది. మొదటి భాగంలో జాన్ అబ్రహం విలన్‌గా, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి సూపర్ హిట్ అయ్యారు. ‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ జంటగా వచ్చి భారీ విజయాన్ని సాధించారు. అయితే ‘ధూమ్ 3’ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘ధూమ్ 4’ పనులు మొదలయ్యాయి. వార్తల ప్రకారం ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ దొంగ పాత్రలో నటించబోతున్నారు. దీనికి ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీనే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ‘వార్ 2’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ మరోసారి ఇలాంటి ఆఫర్‌ను అంగీకరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయనున్నారు.