రివ్యూ : మన శంకర వరప్రసాద్ గారు

Mana shankara vara prasad garu review
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వింటేజ్ కామెడీ టైమింగ్‌కు కేరాఫ్‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారంటే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. దానికి తోడు విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపిస్తాడన్న అనౌన్స్‌మెంట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ : శంకర వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కీలక అధికారి కాగా, హోం మినిస్టర్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఇండియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పరిస్థితుల కారణంగా ఆమెతో విడాకులు తీసుకుంటాడు. హిల్ స్టేషన్‌లోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను మిస్ అవుతూ, వాళ్ల ద్వారా మళ్లీ శశిరేఖకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న సమయంలో, శశిరేఖ తండ్రి జీవీఆర్‌ (సచిన్ ఖేదేకర్)పై గుర్తుతెలియని ముఠా నుంచి ప్రాణాపాయం ఉందని తెలుస్తుంది. దాంతో ఒక ప్రత్యేక పథకం ప్రకారం ఆ కుటుంబానికి సెక్యూరిటీ ఆఫీసర్‌గా రంగంలోకి దిగిన ప్రసాద్, ప్రేమ–విడాకుల వెనుక అసలు కారణాలు, జీవీఆర్‌పై దాడి చేసినవాళ్లు ఎవరు, ఆ కుట్రను తన టీమ్‌తో కలిసి ఛేదించగలిగాడా, చివరకు విడిపోయిన కుటుంబం మళ్లీ కలిసిందా అన్న ప్రశ్నలకు సమాధానాలే ఈ సినిమా కథ.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

అనాలిసిస్ : చదివితే సీరియస్‌గా అనిపించే ఈ కథను అనిల్ రావిపూడి పూర్తిగా లైట్ హార్ట్‌డ్ టోన్‌లో నడిపించారు. కథలో లోతు కన్నా ఎంటర్టైన్మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన బలం. చాలాకాలం తర్వాత ఆయనలోని వింటేజ్ కామెడీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న చిత్రం ఇదే అని చెప్పొచ్చు. అయితే కథన పరంగా చూస్తే కొన్ని లోపాలు కనిపిస్తాయి. విలన్ ట్రాక్ బలవంతంగా జొప్పించినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ పూర్తిగా పిల్లల్ని టార్గెట్ చేసినట్టుగా ఉండి, మెచ్యూర్ ఆడియన్స్‌కు కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని పాటలు, ఎపిసోడ్స్ కథ ఫ్లోలో కాకుండా ఫిల్లర్స్‌లా అనిపిస్తాయి.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటులు : చిరంజీవి శ్రమ, ఎనర్జీ, గ్రేస్ సినిమాకు ప్రధాన హైలైట్. వయసును మరిచిపోయేలా చేసిన డ్యాన్స్, కామెడీ టైమింగ్ అభిమానులకు పండుగే. నయనతార శశిరేఖ పాత్రలో హుందాగా నటించింది; గ్లామర్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేసింది. విక్టరీ వెంకటేష్ పాత్ర స్టార్ అట్రాక్షన్‌లా ఉంటుంది కానీ కథలో కీలకంగా మారదు. సచిన్ ఖేడేకర్, సహాయ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్లస్ పాయింట్. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్‌కు తగ్గట్టే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఘనంగా కనిపిస్తాయి.

ఫైనల్‌గా: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనేది టిపికల్ అనిల్ రావిపూడి సంక్రాంతి సినిమా. లోతైన కథ, ఆర్గానిక్ హాస్యం ఆశిస్తే నిరాశే. కానీ చిరంజీవి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి మాత్రం సరిపడే ట్రీట్.

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5