సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే విషెష్ చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేసిన పవన్


సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేశారు. వీరిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం.

మహేష్ బాబు కు బర్త్ డే విషెష్ చెపుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు అని తన ప్రకటనలో తెలిపారు.

‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మహేష్‌తో ఉన్న అనుబంధాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకొన్నారు.