ప్రముఖ గాయని వాణీ జయరాం అనుమానాస్పద మృతి


గత కొద్దిరోజులుగా సినిమా రంగంలో అంతులేని విషాదాలు చోటుచేసుకున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణాన్ని తెలుగు పరిశ్రమ ఇంకా జీర్ణించుకోక ముందే ప్రముఖ గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. ఇవాళ ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వాణీ జయరాం తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. వాణీజయరాం 14 భాషల్లో దాదాపు 10 వేలకు పైగా పాటలు ఆలపించారు.

కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపుతేవడంతో పాటు తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. అనే పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తరవాత ఆమె పలు భాషల్లో వేల పాటలు పాడారు. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించింది.

శంకరాభరణం మూవీతో వాణీజయరాం-విశ్వనాథ్ లకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ మూవీ విడుదలైన ఫిబ్రవరి 2న కే. విశ్వనాథ్ గారు మరణించారు. ఆయన కన్నుమూసిన రెండో రోజు వాణి జయరాం చనిపోయారు. దీన్ని యాదృచ్ఛికం అనుకోవాలా? దైవేచ్ఛ అనుకోవాలా? అని అభిమానులు వాపోతున్నారు.

ఇదిలా ఉండగా వాణీ జయరాం తన నివాసంలో విగత జీవిగా పడివున్న తీరు, నుదుటి మీద వున్న గాయాలు ఆమె మృతిపై ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. దీంతో వాణీ జయరాం మరణానికి అసలు కారణం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.